మిషన్ రాయలసీమ..వైసీపీ హవాకు గండికొట్టడానికి లోకేష్ వేసిన స్కెచ్ ఇది. ఇంతకాలం సీమలో వైసీపీదే హవా..గత ఎన్నికల్లో పూర్తిగా సీమలో వైసీపీ జోరు కొనసాగింది. ఇక సీమలో టిడిపి సత్తా చాటి చాలా ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇన్నేళ్లకు సీమలో టిడిపి జోరు పెరిగింది. ఈ సారి మంచి ఫలితాలు రాబట్టే దిశగా టిడిపి ముందుకెళుతుంది. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర సీమలో టిడిపికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదట పాదయాత్ర మొదలైనప్పుడు అనుకున్న విధంగా ప్రజా స్పందన రాలేదు.
ఎక్కువ టిడిపి శ్రేణులు కనిపించారు. కానీ నిడనంగా లోకేష్ ప్రజలని కలుస్తూ..వారి సమస్యలు తెలుసుకోవడం, సమస్యలకు పరిష్కారం అయ్యేలా సూచనలు చేయడం..అలాగే అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున అండగా ఉంటామని సీమలోని అన్నీ వర్గాల ప్రజలకు హామీ ఇస్తూ వచ్చారు. దీంతో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ స్థాయిలో పాదయాత్ర సక్సెస్ అయింది. ఇక జగన్ కంచుకోట కడపలో పాదయాత్ర ఎలా సాగుతుందని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఆ మూడు జిల్లాల కంటే ఎక్కువగానే కడపలో లోకేష్ పాదయాత్రకు స్పందన వచ్చింది.

ఈ క్రమంలోనే సీమలో సత్తా చాటాలని చెప్పి లోకేష్..ఇప్పుడు మిషన్ రాయలసీమ అంటూ ముందుకొచ్చారు. మిషన్ కార్యక్రమంతో ఈ ప్రాంత రూపురేఖలే మార్చేస్తామని, సీమలో అపారమైన వనరులు ఉన్నాయని.. పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి.. స్థానికంగానే యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హార్టీకల్చర్ హబ్‌గా మార్చి ప్రపంచానికి అవసరమైన పండ్లను ఎగుమతి చేస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ రూపుమాపుతామని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో వైసీపీకి సీమ నుంచి 49 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని, ఇంత మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఎంత అభివృద్ధి చేయాలి? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? వచ్చే ఎన్నికల్లో 49 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించండి, అభివృద్ధి అంటే చూపిస్తా. చేయకపోతే కాలరు పట్టుకుని నిలదీయండి అని సీమ ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు.
అయితే గత ఎన్నికల్లో సీమలో 52 సీట్లు ఉంటే వైసీపీకి 49, టిడిపికి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు వైసీపీకి భారీ దెబ్బకొట్టి ఆధిక్యం దిశగా టిడిపి వెళుతుంది. ఇంకా ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఎన్నికల సమయంలో తేలుతుంది.