ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గం…తెలుగుదేశం పార్టీకి పట్టున్న స్థానం…2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ స్థానంలో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టిడిపి గెలిచింది. టిడిపి నుంచి బూరుగుపల్లి శేషారావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో ఆయన ఓటమి పాలయ్యారు. పైగా జనసేన ఓట్లు చీల్చడం టిడిపికి మైనస్ అయింది. జనసేనకు ఇక్కడ 23 వేల ఓట్లు పడితే..టిడిపి 21 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది.
వైసీపీ నుంచి జి. శ్రీనివాస్ నాయుడు గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేగా శ్రీనివాస్ నాయుడు నిలిచారు..సరిగ్గా ప్రజల్లో ఉండకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, పైగా ఇక్కడ అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయనే ఆరోపణలు వైసీపీకి మైనస్ గా మారాయి. ఈ క్రమంలో ఇక్కడ టిడిపి గెలుపు అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో జనసేనతో పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది..అదే జరిగితే ఇక్కడ వైసీపీకి చెక్ పడిపోతుంది.

అయితే ఇలా టిడిపి బలం పెరిగిన నేపథ్యంలో అక్కడ ఊహించని విధంగా సీటు కోసం పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం ఇంచార్జ్ గా కొనసాగుతున్న శేషారావు, టిడిపి నేత కుందుల సత్యనారాయణల మధ్య సీటు కోసం పోటీ ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడిపోయాక శేషారావు కొన్ని రోజులు పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ పోటీ చేయలేనని కూడా చెప్పినట్లు తెలిసింది.
కానీ ఎప్పుడైతే టిడిపి బలం పెరుగుతుందో అప్పుడు మళ్ళీ లైన్ లోకి వచ్చారు. ఇటు కుందుల కూడా దూకుడుగా వెళుతున్నారు. ఈ ఇద్దరు నేతలు పోటాపోటిగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు పర్యటనని సైతం పోటాపోటిగా చేశారు. ఇక శేషారావు ఏమో చంద్రబాబు ద్వారా సీటు ట్రై చేస్తుంటే..కుందుల లోకేష్ ద్వారా వస్తున్నారు. మరి ఇద్దరిలో చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
