మొదట నుంచి టిడిపిలో ఎన్ఆర్ఐల జోరు ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి..అక్కడ మంచిగా డబ్బులు సంపాదించి…మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఏదొక ట్రస్ట్, ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తూనే..రాజకీయ పరమైన అంశాల్లో కూడా యాక్టివ్ అవుతారు. ఎన్నికల సమయంలోనే ఎన్ఆర్ఐల జోరు ఎక్కువ ఉంటుంది. సీటు దక్కించుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తుంటారు.
ఇప్పుడు టిడిపిలో పలువురు ఎన్ఆర్ఐలు అదే పనిలో ఉన్నారు. అయితే ఎన్ఆర్ఐలని టిడిపిలో మొదట నుంచి ఉంటున్న నేతలు వ్యతిరేకిస్తున్నారు. మొదట నుంచి పార్టీ కోసం కష్టపడేది తాము అని, ఏదో ఎన్నికల ముందు వచ్చేసి..ట్రస్టులు ద్వారా సేవలు చేసేసి ఓ కోటి రూపాయలు ఖర్చు పెట్టేసినంత మాత్రాన సీట్లు ఎలా ఇస్తారని తాజాగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్ట్రాంగ్ గానే ప్రశ్నిస్తున్నారు.

తాను ఉండే చిలకలూరిపేట సీటుని భాష్యం ప్రవీణ్ ఆశిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ప్రత్తిపాటి ఇలా తీవ్రంగా స్పందించారు. అసలు నియోజకవర్గాల గురించి అవగాహన లేకుండా ఏదో సేవా చేసేశారని సీటు ఇస్తే పార్టీకే నష్టమని అంటున్నారు. వాళ్ళు ఓడిపోతే మళ్ళీ అడ్రెస్ లేకుండా వెళ్లిపోతారని చెబుతున్నారు.
అయితే ప్రత్తిపాటి చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎన్నికల ముందు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారు..సీటు దక్కితే పోటీ చేస్తారు..గెలిస్తే ఉంటారు..ఓడితే అడ్రెస్ ఉండరు. అలాంటి వారి వల్ల పార్టీకి ఇబ్బంది. ఇక ఎన్ఆర్ఐల గా వచ్చి సీటు ఆశిస్తున్న వారు భాష్యం ప్రవీణ్, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉదయగిరిలో కాకర్ల సురేష్, శృంగవరపుకోటలో గంప కృష్ణ, గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ..ఇలా పలువురు ఎన్ఆర్ఐలు ఉన్నారు. మరి బాబు వారికి సీట్లు ఇస్తారో లేదో చూడాలి.