పెనుకొండ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ టిడిపి మంచి విజయాలు సాధించింది..1983 నుంచి వరుస విజయాలు సాధించింది..మధ్యలో 1989లో ఒకసారి ఓడిపోయింది..అంతే మళ్ళీ అక్కడ నుంచి వరుసగా సత్తా చాటింది. పరిటాల రవీంద్ర మూడుసార్లు ఇక్కడ నుంచే గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి బికే పార్థసారథి గెలిచారు.
అయితే 2019 ఎన్నికల్లో కూడా ఈయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. పెనుకొండలోనే కియా పరిశ్రమ పెట్టడం..అభివృద్ధి చెందడంతో అక్కడ టిడిపి గెలుస్తుందని అనుకున్నారు..కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి శంకర్ నారాయణ గెలిచారు. ఇక గెలిచిన త్వరగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడంలో శంకర్ నారాయణ ముందు నిలిచారు. మంత్రిగా చేసిన నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ. అసలు ఈయన మంత్రిగా చేశారని ప్రజలకు పెద్దగా తెలియదంటే..ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఆ తర్వాత మంత్రి పదవి పోయింది..అయినా ఎమ్మెల్యేగా పెనుకొండకు చేసేదేమీ లేదు. పైగా ఆయన అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా శంకర్ నారాయణ , ఆయన సోదరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అవినీతి అనకొండ అని, సొంత పార్టీ నేతలే మా కొద్దూ అవినీతి అనకొండ అని ధర్నాలు చేస్తున్నారని, ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవాలని విమర్శించారు.
ఇక నియోజకవర్గంలో ఎక్కడ లే ఔట్ వేసినా ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఎకరాకి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని, పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారని, కర్ణాటక నుంచి డీజిల్ తెచ్చి లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇవి ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. దీంతో పెనుకొండలో ఎమ్మెల్యేనే వైసీపీకి మైనస్ అని తెలుస్తోంది..అదే అంశం టిడిపికి ప్లస్ అవుతుంది. ఈ సారి పెనుకొండలో టిడిపి జెండా ఎగిరేలా ఉంది.
