వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. ఈయనకు ఎంత ఆవేశం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్ధులని ఎలా తిడతారు అనేది చెప్పవసరం లేదు. రాజకీయంగా రెండుసార్లు విజయాలు అందుకున్నారు. జగన్ సపోర్ట్ ఉంది. రెండున్నర ఏళ్ళు మంత్రిగా చేశారు. దీంతో తనకు తిరుగులేదనే విధంగా అనిల్ రాజకీయం నడుస్తుంది. కానీ ఈ సారి ఆయనకు ఎదురుదెబ్బ గట్టిగా తగిలేలా ఉంది.

ప్రత్యర్ధి పార్టీ టీడీపీ చేతుల్లోనే కాదు..సొంత పార్టీ వైసీపీ వాళ్లే అనిల్‌కు చెక్ పెట్టేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో అనిల్ నెల్లూరు సిటీ నుంచి స్వల్ప మెజారిటీలతోనే గెలిచారు. కానీ ఈ సారి గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. సిటీలో టిడిపి బలం పెరుగుతుంది. అటు అనిల్ పై వ్యతిరేకత కనిపిస్తుంది. మంత్రిగా పనిచేసినప్పుడే సిటీలో అభివృద్ధి చేయలేకపోయారు. పైగా ఆయనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తన బాబాయి రూప్ కుమార్ యాదవ్ తో అనిల్‌కు పొసగడం లేదు. ఈ ఇద్దరినీ జగన్ ఒకసారి కలిపారు. అయినా సరే ఇద్దరు కలిసిపనిచేయడం లేదు. అలాగే రూప్ కుమార్ సెపరేట్ కార్యక్రమాలు చేస్తున్నారు. తన బలం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ఆయన సొంతంగా పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించారు. దీంతో అనిల్‌కు చిక్కులు పెరిగాయి. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన సీటుకు సైతం ఎసరు పెట్టేలా ఉన్నారు. ఒకవేళ అనిల్‌కు సీటు దక్కిన సొంత వాళ్ళే సహకరించేలా లేరు. ఏదేమైనా ఈ సారి అనిల్‌కు హ్యాట్రిక్ దక్కేలా లేదు.