మళ్ళీ టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు విరామం లేకుండా ప్రజల్లో తిరుగుతూ, మరోవైపు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తూ పనిచేస్తున్నారు. ఇటు లోకేష్ పాదయాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్నారు. ఇలా పార్టీ కోసం కష్టపడుతుంటే..కొందరు నేతలు పార్టీకి డ్యామేజ్ చేసే పనులు చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు సీట్లు ప్రకటించక ముందే సీట్ల కోసం పోరు మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో సీట్ల కోసం రచ్చ నడుస్తోంది.

ఇదే క్రమంలో తాజాగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. ఇంకా ఈ సీటుని బాబు ప్రకటించలేదు. ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ గా కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. అంతకముందు ఆయన తండ్రి కాగిత వెంకట్రావు పనిచేశారు. ఇలా కాగిత ఫ్యామిలీకి పెడన సీటు వస్తుంది..నెక్స్ట్ కూడా ఆ సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఆయనే ప్రజల్లో ఉంటున్నారు.
ఇలాంటి సమయంలో పెడన సీటు తనదే అని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ప్రకటించారు. చంద్రబాబు ఎవరికి సీటు ఇవ్వలేదని,తనకు ఇస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు. గతంలో బూరగడ్డ మల్లేశ్వరం(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచారు.

2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి మచిలీపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పెడన లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టిడిపి నుంచి కాగిత వెంకట్రావు గెలిచారు. అయితే ఆ తర్వాత బూరగడ్డ టిడిపిలోకి వచ్చారు. 2019లో ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ పెడన సీటు ఆశిస్తున్నారు. దీని వల్ల పెడనలో కాగిత వర్గం సీరియస్ గా ఉంది. మళ్ళీ వర్గపోరు మొదలయ్యేలా ఉంది. కాబట్టి బాబు పెడన సీటుని త్వరగా ఫిక్స్ చేస్తే బెటర్.