తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణ వాదంతో వచ్చిన టిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి చేస్తున్నామంటూ, మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రెండోసారి కూడా కేసీఆర్ కి పదవిని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. కానీ అభివృద్ధి పథంలో నడపాల్సిన రాష్ట్రాన్ని అన్ని విధాల పక్కన పెట్టారని విమర్శలు వస్తున్న తరుణంలో, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొత్త సీఎం రాష్ట్రాన్ని ఎటువైపు నడిపిస్తారో అని తెలంగాణ ప్రజలందరూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో విభిన్న వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ వాదంతో కరుడు కట్టిన సీనియర్ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన యువ నేతలు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి సీనియర్ల సలహాలు పాటిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి వలె సంక్షేమ పథంలో నడిపిస్తారా లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇన్నాళ్లు కుటుంబ పరిపాలనతో విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు కొత్త పరిపాలన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి వారి ఆశలను నెరవేరుస్తారా లేదా వేచి చూడాల్సిందే….