తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తు ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి వైసీపీకి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నాయి. అయితే పొత్తులో భాగంగా టిడిపి..జనసేనకు కొన్ని సీట్లు వదలాలి. ఇప్పుడు జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ జరుగుతుంది. జనసేనకు ఏ సీట్లు ఇస్తారు..ఆ సీట్లలో టిడిపి ఓట్లు..జనసేనకు పూర్తిగా బదిలీ అవుతాయా? లేదా? అనే చర్చ సాగుతుంది. ఓట్లు పూర్తిగా బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అవుతుంది.
ఇప్పుడు ఆ దిశగా బాబు, పవన్ చర్చల్లో ఉన్నారు. ఇదే క్రమంలో జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల పోటీ చేసే సీటు ఏదో తేల్చేశారు. సీట్ల పంపకాల గురించి బాబు, పవన్ మాట్లాడుకుంటారని చెప్పిన ఆయన..తాను మాత్రం తెనాలి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. గతంలో ఈయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక 2014లో ఇక్కడ టిడిపి నుంచి ఆలపాటి రాజా గెలిచారు. 2019లో వైసీపీ గెలిచింది. టిడిపిపై దాదాపు 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అప్పుడు జనసేన నుంచి బరిలో దిగిన మనోహర్‌కు 30 వేల ఓట్లు పడ్డాయి.

అంటే అప్పుడే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలిచేది కాదు. ఇప్పుడు పొత్తు ఫిక్స్ అయింది..తెనాలి సీటు జనసేనకే దక్కనుంది. నాదెండ్ల పోటీ చేస్తారు. మరి టిడిపి నేత ఆలపాటి రాజా పరిస్తితి ఏంటి? అనే ప్రశ్న వస్తుంది. ఆయన్ని వేరే సీటుకు పంపుతారా? లేక ఎమ్మెల్సీ ఇస్తారా? అధికారంలోకి వచ్చాక వేరే పదవి ఇస్తారా? అనేది చూడాలి.
అయితే రాజా ఇదివరకే చెప్పేశారు. బాబు ఏం చెబితే అదే చేస్తానని, సీటు ఇవ్వకపోయిన, తన భవిష్యత్ బాబు చూసుకుంటారని చెప్పారు. దీంతో తెనాలి సీటు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాదెండ్లకే దక్కనుంది.