ఈ సారి ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలోని ఆమదాలవలస ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ సొంత బంధువుల మధ్య ఫైట్ జరగనుంది. బావాబామ్మర్దుల మధ్య ఫైట్ జరగనుంది. వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం, టిడిపి నుంచి కూన రవికుమార్..ఇద్దరు సొంత బావాబామ్మర్దులు అనే సంగతి తెలిసిందే. అలాగే మరో వరుసలో మేనమామ-మేనల్లుడు అవుతారు.

అంటే ఇంకా ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా సరే..వీరి మధ్య రాజకీయ శతృత్వం కూడా ఉంది. గత మూడు ఎన్నికల నుంచి వీరు రాజకీయ శత్రువులుగా తలపడుతున్నారు. వాస్తవానికి తమ్మినేని మొదట్లో టిడిపి మనిషి..ఎన్టీఆర్ పై అభిమానంతో టిడిపిలోకి వచ్చారు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి ఆమదాలవలసలో గెలిచారు. 2004లో ఓడిపోయారు. ఇక 2009లో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఇక తమ్మినేని వెనుక అప్పటివరకు పనిచేసిన ఆయన బామ్మర్ది కూన రవికుమార్ టిడిపిలోనే కొనసాగారు. 2009లో కూన టిడిపి నుంచి, తమ్మినేని ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. కానీ ఇద్దరు నేతలు ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది.

ఆ తర్వాత తమ్మినేని వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో 2014లో కూన టిడిపి నుంచి, తమ్మినేని వైసీపీ నుంచి పోటీ చేశారు..గెలుపు కూనని వరించింది. 2019లో రివర్స్ అయింది. తమ్మినేని గెలిచారు. అలాగే స్పీకర్ అయ్యారు. కానీ ఆయన పై ఇప్పుడు వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తుంది. స్పీకర్ గా ఆయన వైఖరి ప్రజలకు నచ్చడం లేదు. నియోజకవర్గంలో కూడా చేసిందేమి లేదు. దీంతో ఆమదాలవలసలో వైసీపీకి యాంటీ పెరిగింది.
ఈ క్రమంలోనే కూన రవికుమార్ బలపడుతున్నారు. ఆయన టిడిపిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తన బావకు కూన గట్టి పోటీ ఇవ్వడం ఖాయమే. ఎన్నికల సమయానికి టిడిపి హవా పెరిగితే తమ్మినేనికి కూన చెక్ పెట్టడం ఖాయమే.