రాజమండ్రిలో మహానాడు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. లక్షలాది జనం మహానాడుకు తరలి వచ్చారు. పైగా మహానాడులో చంద్రబాబు ప్రకటించిన హామీలు ప్రజలని ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో టిడిపికి కొత్త ఊపు వచ్చింది. ఇక మహానాడు జరిగిన రాజమండ్రి ప్రాంతంలో టిడిపికి మరింత మైలేజ్ పెరుగుతుందనే చెప్పాలి.
ఎలాగో రాజమండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ సీట్లలో టిడిపికి పట్టు ఉంది. ఆ రెండు టిడిపి సిట్టింగ్ సీట్లు. అవి పక్కన పెడితే..రాజమండ్రి ఎంపీ సీటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా రాజమండ్రి ఎంపీ సీటుని టిడిపి ఎక్కువసార్లు గెలుచుకోలేదు. 1984, 1991, 2014 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. ఇక టిడిపి పొత్తులో బిజేపి 1999 ఎన్నికల్లో గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి మార్గని భరత్ గెలిచారు. ఎంపీగా భరత్ రాజమండ్రికి చేసిందేమి కనిపించడం లేదు. పైగా ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక రాజమండ్రి ఎంపీ సీటు పరిధిలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇటు టిడిపి నుంచి సైతం ఆ క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆమె పార్టీకి దూరమయ్యారు. దీంతో నెక్స్ట్ ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టిడిపి నుంచి బొడ్డు వెంకటరమణ, లోహిత్ లాంటి నేతలు ట్రై చేస్తున్నారు.
కానీ బాబు ఎవరికి సీటు ఫిక్స్ చేయడం లేదు. అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తు ఖాయమవుతున్న నేపథ్యంలో రాజమండ్రి సీటు విషయంలో క్లారిటీ కావాల్సి ఉంది. అయితే టిడిపి-జనసేన కలిస్తే రాజమండ్రి ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ..టీడీపీపై లక్షా 21 వేల ఓట్లతో గెలిస్తే జనసేనకు లక్షా 55 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీలు కలిస్తే వైసీపీ గెలవడం కష్టమే.