ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం…చంద్రబాబు అరెస్ట్ అయితే అక్కడ ర్యాలీలు చేయండి..నిరసనలు చేయండి..తెలంగాణలో చేయడానికి వీలులేదు. ఇక్కడ శాంతిభద్రతల సమస్య వస్తుంది. బాబు అరెస్ట్ రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయం..వారు అక్కడే తేల్చుకోవాలి అంటూ తెలంగాణ మంత్రి కేటిఆర్ తాజాగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని, ఏపీలో ఒకరితో ఒకరు తలపడండి వాళ్ళ వాళ్ళ పంచాయితీలు హైదరాబాద్ లో పెడతామంటే ఎలా? ఆ రెండు పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదని కేటిఆర్ అన్నారు.
దీనిపై కేటిఆర్ పై తీవ్ర స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. తెలంగాణలో టిడిపి పుట్టిందని, చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సిఎం చేశారని, తెలంగాణలో వైసీపీ లేదేమో గాని..టిడిపి ఉందని..గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వారిని బిఆర్ఎస్ లోకి లాక్కున్నారని, ఇక్కడ టిడిపి నాయకులు ఉన్నారని, అలాంటప్పుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలియజేయకూడదని కేటిఆర్ అనడం సరికాదని, ఇది పక్కాగా కేసిఆర్ రాజకీయమని తమ్ముళ్ళు మండిపడుతున్నారు.
బాబు అరెస్ట్ పై పార్టీలకు అతీతం అందరూ ఖండిస్తున్నారని, తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపి నేతలు తమ వ్యక్తిగతంగా స్పందిస్తున్నారని, కానీ బిఆర్ఎస్ దీనిపై అధికారికంగా స్పందించకపోయిన పర్లేదు అని, కానీ నిరసన తెలియజేసే హక్కు లేదని చెప్పడం కరెక్ట్ కాదని, దేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేయవచ్చు అని చెబుతున్నారు.
అయినా ఇది పక్క రాష్ట్రం సమస్య అంటున్న కేటిఆర్..ఏపీలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరికి ఎలాంటి సంబంధం ఉందో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టిడిపిని అభిమానించే వారు తేలుస్తారని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో టిడిపి అభిమానులు ఈ సారి బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నారు.