చంద్రబాబు తేల్చేశారు..ఎవరికి సీటు ఇవ్వాలో..ఎవరికి ఇవ్వకూడదో దాదాపు తేల్చి చెప్పేశారు. గతంలో మాదిరిగా ఈ సారి మొహమాటం లేదని అంటున్నారు. గెలిచే వారికే సీటు..గెలవని సత్తా లేని వారికి సీటు లేదు. ఆ ప్లేస్ లో ఎలాంటి పెద్ద నాయకుడు ఉన్నా సరే సీటు మాత్రం ఇవ్వనని చెప్పేశారు. తాజాగా సత్తెనపల్లి సీటు విషయంలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కోడెల శివప్రసాద్ వారసుడు శివరాంని సైడ్ చేసి..కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఫిక్స్ చేశారు.
ఇక దీనిపై టిడిపి అధిష్టానంపై విమర్శలు వస్తున్నాయి. కోడెల కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు. శివరాం సైతం తమని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మాట్లాడారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు సీట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సీట్లలో పోటీ చేసే అంశంలో ఐదు రకాలుగా సర్వేలు చేస్తున్నామని, ఆ సర్వేలో మొదట ఉన్న వారికే సీట్లు ఇస్తున్నామని, అలా కానీ పక్షంలో సీట్లు ఇవ్వడం లేదని, సీట్లు దక్కని వారికి వేరే విధంగా న్యాయం చేస్తామని బాబు చెబుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తాను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదని, మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేమని, కౌరవ సభను గౌరవ సభ చేసిన తర్వాతే సభలోకి అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశానని, అది నెరవేరాలంటే గట్టి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపి గెలవాలని సూచించారు.
ఇక ఐదారు మార్గాల ద్వారా ప్రతి నియోజకవర్గ సమాచారం సేకరించి, సర్వేలు చేయిస్తున్నామని, పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్నామని, అన్నీ పరిగణనలోకి తీసుకునే అభ్యర్థులను ఖరారు చేస్తామని అన్నారు. అంటే సీట్లు ఎలా ఇస్తారో చెప్పేశారు. అదే సమయంలో ఎన్నికల బరిలో దింపే అభ్యర్ధుల మొదటి లిస్ట్ సైతం బాబు రెడీ చేస్తున్నారని తెలిసింది. దసరాకు మేనిఫెస్టోతో పాటు అభ్యర్ధుల లిస్ట్ కూడా విడుదల చేస్తారని సమాచారం.