ఎవరైనా ఒకసారి మోసం చేయవచ్చు..రెండోసారి మోసం చేయవచ్చు..కానీ పదే పదే చేయడం కుదరదు. ప్రజలు పూర్తిగా తెలుసుకుంటారు. రివర్స్ అవుతారు. ఇప్పుడు వైసీపీకి అదే పరిస్తితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో టిడిపిని నెగిటివ్ చేయడానికి ఎన్ని అబద్దాలు చెప్పారో చెప్పాల్సిన పని లేదు..అలాగే ఎన్ని రకాలుగా ప్రజలని మభ్య పెట్టారో తెలిసిందే. ప్రజలు కూడా నమ్మి ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. గెలిపించాక అసలు సినిమా కనబడుతుంది.
అయినా సరే ఇప్పటికీ అదే విధంగా వైసీపీ ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేసి మళ్ళీ గెలవాలని చూస్తుంది. కొన్ని కీలక రాజకీయ సమీకరణాలని తెరపైకి తెస్తుంది. ఇదే క్రమంలో టిడిపి, జనసేన పొత్తు ఉంటే గోదావరి జిల్లాల్లో భారీగా నష్టపోతుంది. కాపు ఓట్లు కోల్పోతుంది. ఈ క్రమంలోనే ఆ నష్టం జరగకుండా ఉండాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని తెరపైకి తెస్తుంది.

గతంలో టిడిపి అధికారంలో ఉండగా ముద్రగడని ముందు పెట్టి కాపు ఉద్యమం అంటూ వైసీపీ చేసిన రాజకీయ క్రీడ అందరికీ తెలుసు. అదే ముద్రగడ టిడిపి హయాంలో నానా రచ్చ చేసి..వైసీపీ అధికారంలోకి రాగానే కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. దీని బట్టే అర్దం చేసుకోవచ్చు ముద్రగడ ఎత్తు ఏంటి అనేది. సరే ముద్రగడ ముసుగు తీశారు. ఆయన వైసీపీ మద్దతుదారుడు అని అర్ధమైంది. ఇప్పుడు ఏకంగా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ముద్రగడని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని తీసుకొచ్చి కాకినాడ ఎంపీ సీటు లేదా ఏదైనా అసెంబ్లీ సీటు ఇవ్వాలని చూస్తున్నారు. లేదా ఆయన తనయుడుకైన సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ముద్రగడ ద్వారా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే ముద్రగడని కాపు వర్గమే పెద్దగా నమ్మడం లేదు. ఇక ఆయన్ని ముందు పెట్టుకుని వెళితే గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి అస్సామే.