తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త పార్టీలో పరిస్తితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 15కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంటే…టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే తర్వాత పార్టీ నిదానంగా పుంజుకుంటూ వచ్చింది. దాదాపు 5-6 స్థానాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైంది. అలాగే జనసేనతో పొత్తు కూడా ఉంటుందనే నేపథ్యంలో జిల్లాలో లీడ్ సాధించే పరిస్తితి.

కాకపోతే కొన్ని స్థానాల్లో టీడీపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సీటు దక్కించుకోవడం కోసం నేతల మధ్య పోటీ పెరిగింది. టీడీపీ అధిష్టానం కూడా కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. అందులో కంచుకోట లాంటి కొవ్వూరు ఉంది. అంతర్గత విభేదాలతోనే ఈ సీటులో టీడీపీ ఓడిపోయింది. ఈ సీటు కోసం కేఎస్ జవహర్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సీటు దక్కకుండా చేయాలని వేరే వర్గం ట్రై చేస్తుంది. ఇలా కొవ్వూరులో పోరు నడుస్తోంది.

ఇక చింతలపూడి సీటులో అదే పరిస్తితి..ఈ సీటు కోసం నేతల మధ్య పోరు నడుస్తోంది. చంద్రబాబు సైతం ఈ సీటు ఇంకా ఎవరికి ఫిక్స్ చేయలేదు. అటు పోలవరం సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. బొరగం శ్రీనివాసరావు, మోడియం శ్రీనివాసరావుల మధ్య సీటు రచ్చ ఉంది. ఇక గోపాలాపురంలో కూడా అదే రచ్చ జరుగుతుంది. అటు నిడదవోలు సీటులో కూడా రచ్చ ఉంది. మొన్నటివరకు మాజీ ఎమ్మెల్యే శేషరావు పార్టీని పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యి సీటు కోసం ట్రై చేస్తున్నారు.

అయితే తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం లాంటి సీట్లలో కూడా పోరు ఉంది..కాకపోతే ఆ సీట్లు జనసేనకు దక్కుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఆ సీట్లలో తలనొప్పి లేదు. ఇటు సిట్టింగ్ సీటు అయిన ఉండిలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజుల మధ్య పోరు నడుస్తోంది. కాబట్టి జిల్లాపై బాబు ఫోకస్ చేసి..ఈ రచ్చలకు బ్రేక్ వేస్తే పార్టీ బాగుపడుతుంది.
