ఎక్కడైనా చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదు గాని..చేయని వాటిని చెప్పుకోవడం..గతంలో కట్టిన బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, పేర్లు మార్చడం, ఆఖరికి పొలం సర్వేల పేరిట..పట్టాదారు పాస్ బుక్‌లపై, పొలం డాక్యుమెంట్లపై జగన్ బొమ్మ వేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు పరిస్తితి వచ్చింది. ఇప్పటికే కనిపించిన వాటి అన్నిటికి రంగులు వేసేశారు. ఇప్పుడు కొత్తగా ప్రతి ఇంటికి జగన్ స్టిక్కర్ అంటించడానికి సిద్ధమయ్యారు.

అయితే ఇక్కడ ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించడం అనేది కరెక్ట్ కాదనే చెప్పాలి. దీనికి మళ్ళీ కోట్లు ఖర్చు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైసీపీ అనుకునేలా స్టిక్కర్ అంటించడం అనేది సరికాదు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు..జనసేన, బిజేపి, కాంగ్రెస్ లని అభిమానించే వారు ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి ఇంటికి జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్ అంటించడం, పైగా దానిపై ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట స్టిక్కర్లు అంటించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వైసీపీ ప్రభుత్వమే చెప్పాలి.

అయితే ఈ స్టిక్కర్లు అంటించడం వెనుక ఓ స్కెచ్ కూడా ఉందని తెలుస్తోంది. ఎలాగో టిడిపి, జనసేన వాళ్ళు జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్లని అంటిస్తే ఒప్పుకోరు. దీంతో వారు ఆ పార్టీలకు చెందిన వారు అని తేలిపోతుంది. దీంతో వైసీపీ..వారి ఓట్లని తొలగించడానికి చూసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఐప్యాక్ టీం ఎఫెక్ట్ అని ఆంటున్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లో రోజూ తిరుగుతుండే వలంటీర్లను ముందు పెడితే జనం నాడి తెలిసిపోతుందని అంచనావేస్తున్నారు. మొత్తానికి ఈ స్టిక్కర్లు అంటించడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి జగన్ స్టిక్కర్లు..ఇదో స్కెచ్?
