ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి..ఈ జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. రెండు జిల్లాలు కలిపి 34 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందో..ఆ పార్టీకి అధికారం దక్కడం సులువు అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో రెండు జిల్లాల్లో కలిపి టిడిపి 27 సీట్లు గెలుచుకుంది. టిడిపితో పొత్తులో భాగంగా బిజేపి 2 సీట్లు గెలుచుకుంది. ఇక వైసీపీకి పశ్చిమ గోదావరిలో ఒక్క సీటు రాలేదు. తూర్పులో మాత్రం 5 సీట్లు వచ్చాయి. అప్పుడు రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. రెండు జిల్లాల్లో కలిపి వైసీపీ 27 సీట్లు గెలుచుకోగా, టిడిపి 6 సీట్లు, జనసేన 1 సీటు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకే ఈ రెండు జిల్లాలని ఒక జోన్ గా పెట్టి..తాజాగా రెండు జిల్లాలకు చెందిన నేతలతో బాబు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇదేం ఖర్మ కార్యక్రమం, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, మ్యాపింగ్‌తో సహా ఇతర కార్యక్రమాల్లో ఎవరు మంచి పనితీరును కనబర్చారో వారి గురించి అందరికీ వివరించారు . ఈ అంశంలో పశ్చిమలో ఉంగుటూరు, తూర్పులో కొత్తపేట స్థానాలు టాప్ లో ఉన్నాయని చెప్పారు. అలాగే ఆ తర్వాత గోపాలాపురం కూడా ఉందని చెప్పారు.

దీంతో ఉంగుటూరు ఇంచార్జ్ గన్ని వీరాంజనేయులు, కొత్తపేట ఇంచార్జ్ బండారు సత్యానందం ఇంచార్జ్‌లతో మాట్లాడించి..వారు ఎలా వర్క్ చేశారో..ఇతర ఇంచార్జ్‌లకు వివరించి చెప్పించారు. అయితే ఏప్రిల్ 15 నాటికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సిందేనని అందరికీ దిశ, నిర్దేశం చేశారు.

