గతంతో పోలిస్తే తుని నియోజకవర్గం పోరు రంజుగా సాగేలా ఉంది. మూడు ఎన్నికల నుంచి ఇక్కడ వన్ సైడ్ గా పోరు నడుస్తోంది. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో వన్ సైడ్ గా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలుస్తూ వస్తున్నారు. అసలు టీడీపీకి కంచుకోటగా ఉన్న తుని స్థానాన్ని వైసీపీ అడ్డాగా మార్చేస్తూ వస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు తునిలో గెలిచారు.

అన్నీ సార్లు గెలవడంతో సాధారణంగా వచ్చే వ్యతిరేకతతో 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత యనమల పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో 2014లో తుని లో టిడిపి నుంచి యనమల కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. అయినా అప్పుడు టిడిపి అధికారంలోకి రావడం, యనమల మంత్రిగా పనిచేయడంతో తునిలో యనమల ఫ్యామిలీ హవా నడిచింది. దీంతో యనమల ఫ్యామిలీపై కాస్త వ్యతిరేకత కొనసాగినట్లు కనిపించింది.


ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో మరోసారి తునిలో టిడిపి ఓడిపోయింది. కానీ నిదానంగా రాష్ట్రంలో టిడిపి బలపడుతూ వస్తుంది. కాకపోతే తునిలో టిడిపి బలపడినట్లు కనిపించలేదు. దీంతో అక్కడ అభ్యర్ధిని మార్చాలనే డిమాండ్ వచ్చింది. యనమల సోదరుడుని సైడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో యనమల తన తమ్ముడుని తప్పించినా సరే..తన కుమార్తె దివ్యకు తుని సీటు ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు.


ఇప్పుడు తుని రేసులోకి దివ్య వచ్చింది..ఇక దివ్య..దాడిశెట్టి రాజాకు ఏ మేర చెక్ పెడుతుందనేది చూడాలి. అయితే రాజాపై కాస్త వ్యతిరేకత ఉంది..కానీ యనమల ఫ్యామిలీ ఇంకా బలపడాలి. అప్పుడే తుని సీటుని గెలుచుకోవడం సాధ్యమవుతుంది. ఈ సారి తుని సీటు టిడిపికి దక్కుతుందో లేదో చూడాలి.
