March 22, 2023
రాజోలు-అమలాపురంలో జనసేనతోనే రిస్క్.!
ap news latest AP Politics TDP latest News

రాజోలు-అమలాపురంలో జనసేనతోనే రిస్క్.!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా మంచి విజయాలు అందుకోని నియోజకవర్గాల్లో రాజోలు, అమలాపురం ఉంటాయని చెప్పాలి. మొదట నుంచి ఈ ఎస్సీ స్థానాల్లో టి‌డి‌పి గొప్ప విజయాలు ఏమి సాధించలేదు. రాజోలులో టి‌డి‌పి ఐదు సార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. అంటే టి‌డి‌పి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాజోలులో టి‌డి‌పి గెలిచింది.

అయితే ఇప్పుడు రాజోలులో టి‌డి‌పి పరిస్తితి కాస్త భిన్నంగా ఉంది. జనసేన ఎంట్రీతో అక్కడ టి‌డి‌పి బలం తగ్గింది. గత ఎన్నికల్లో రాజోలులో త్రిముఖ పోరు నడిచింది. జనసేన-వైసీపీ-టి‌డి‌పిల మధ్య వార్ నడిచింది. అయితే ఈ పోరులో వైసీపీపై 814 ఓట్ల తేడాతో జనసేన గెలిచింది. జనసేనకు 50 వేల ఓట్ల వరకు వస్తే..వైసీపీకి 49 వేల వరకు వచ్చాయి. అటు టి‌డి‌పికి 44 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే మూడు పార్టీలకు ఇక్కడ సమాన బలం ఉంది. కాకపోతే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో రాజోలులో జనసేన శ్రేణులు కసిగా ఉన్నాయి. వైసీపీని ఓడించాలని చూస్తున్నారు.

దీంతో అక్కడ ప్రధాన పోరు వైసీపీ-జనసేనల మధ్యే జరిగేలా ఉంది. టి‌డి‌పి మూడో స్థానంకు వెళ్ళేలా ఉంది. కాకపోతే టి‌డి‌పి-జనసేన పొత్తు ఫిక్స్ అయితే మాత్రం సీన్ మారుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఖచ్చితంగా ఆ సీటు జనసేనకు దక్కడం ఖాయం. పొత్తు లేకపోతే రాజోలులో టి‌డి‌పి గెలుపు కాస్త కష్టమే.

అటు అమలాపురంలో అదే పరిస్తితి. ఇక్కడ టి‌డి‌పి మూడుసార్లు మాత్రమే గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీకి 72 వేలు, టి‌డి‌పికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే ఇక్కడ టి‌డి‌పితో దగ్గరగా జనసేన ఓట్లు తెచ్చుకుంది. ఒకవేళ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్ ఖాయం. అయితే పొత్తు ఉంటే ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.