గత ఎన్నికల మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయడం, మళ్ళీ ఇబ్బందులు పడటం లాంటివి జరగకూడదని చెప్పి..టీడీపీ అధినేత చంద్రబాబు..గత ఏడాది నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లని ఫిక్స్ చేస్తూ..వారితో వన్ బై వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచేలా ముందుకెళుతున్నారు.

అలాగే కొందరికి దాదాపు సీట్లు ఫిక్స్ అని చెప్పేస్తున్నారు. కొందరిని పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఇంకా ఖాళీగా ఉన్న కొన్ని స్థానాలకు చంద్రబాబు ఇంచార్జ్‌లని ఫిక్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తన సొంత జిల్లా చిత్తూరులోని సత్యవేడు స్థానానికి కొత్త ఇంచార్జ్‌ని నియమించారు. మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. మామూలుగా సత్యవేడు కాస్త టిడిపికి అనుకూలమైన స్థానమే. 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. పైగా తర్వాత సరైన నాయకత్వం లేదు.

2009లో టిడిపి నుంచి హేమలత గెలిస్తే..2014లో తలారి ఆదిత్య గెలిచారు. 2019 ఎన్నికల్లో జడ్డా రాజశేఖర్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే చివరికి హేమలతకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె కుమార్తెకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. దీంతో సత్యవేడు నుంచి నెక్స్ట్ హెలెన్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్ట్రాంగ్ గా ఉన్నారు.

అయితే నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరగడం..మరోవైపు లోకేష్ పాదయాత్ర టిడిపికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి గట్టిగా కష్టపడితే సత్యవేడులో టిడిపికి గెలిచే అవకాశాలు ఉన్నాయి.
