కంచుకోట లాంటి తుని నియోజకవర్గాన్ని టీడీపీ చేతులారా నాశనం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 1983 నుంచి 2004 వరకు టీడీపీ నుంచి వరుసగా గెలిచి..2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇలా మూడుసార్లు ఓడిపోయినా సరే..తునిలో యనమల ఫ్యామిలీపై ప్రజల్లో సింపతీ ఏమి లేదు. మరొకసారి వారికి సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని ప్రచారం వస్తుంది. ఇక్కడ వైసీపీ వైపున మంత్రి దాడిశెట్టి రాజా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని తెలుస్తోంది.

అయితే యనమల ఫ్యామిలీపై మైనస్ ఉండటంతో..ఈ సీటు విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ ఎదురు చూస్తుంది. కానీ యనమల లాంటి సీనియర్ నేతని కాదని మరొకరికి సీటు ఇవ్వడం కష్టం. పైగా ఈ మధ్య యనమల ఈ మధ్య తన తమ్ముడుకు కాకుండా ఈ సారి తన కుమార్తె దివ్యకు తుని సీటు ఇవ్వాలని బాబుని కోరారట.

ఇక ఈ అంశమే ఇప్పుడు యనమల ఫ్యామిలీలో చిచ్చు రేపింది. తనకు కాకుండా దివ్యకు సీటు ఇవ్వాలని ప్రతిపాదించడంపై కృష్ణుడు మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని క్యాడర్‌కు ఫోన్ చేసి..తనకే సీటు ఇచ్చేలా యనమలపై ఒత్తిడి చేయాలని చెబుతున్నట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. తానే నియోజకవర్గాన్ని చూసుకుంటున్నానని, ఇంట్లో ఉండే దివ్య వల్ల ఉపయోగం ఉండదని, కాబట్టి తుని సీటు తనకే ఇవ్వాలని యనమలపై ఒత్తిడి తేవాలని చెప్పి కృష్ణుడు..కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.

కృష్ణుడు ఆడియో వైరల్ గా మారడంతో తుని టీడీపీలో కొత్త ఇబ్బందులు వచ్చాయి. అయితే అసలు యనమల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి సీటు ఇవ్వాలని టీడీపీలో కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి చివరికి చంద్రబాబు..తుని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
