తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు స్థానంలో వైసీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. తాజాగా తూర్పు వైసీపీ శ్రేణులతో జగన్ సమావేశమయ్యారు. అవినాష్‌ని మీ చేతుల్లో పెడుతున్నానని, గెలిపించి తీసుకురావాలని చెప్పి జగన్..తూర్పు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మరొక 30 ఏళ్ళు మనదే అని సూచించారు.

అయితే తూర్పు అభ్యర్ధిగా అవినాష్‌ని పెట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో,జనసేన ఓట్లు చీల్చిన సరే 15 వేల ఓట్ల మెజార్టీతో గద్దె గెలిచారు. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తున్నారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు. వివాదరహితుడుగా ఉంటూ..అన్నీ వర్గాల ప్రజలకు అండగా ఉంటారు. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా, ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇటు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న అవినాష్ సైతం..ప్రభుత్వ నిధులతో పనులు చేయిస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. దేవినేనికి సైతం తూర్పుపై పట్టు ఉంది. ఇక అటు గద్దెకు సైతం నియోజకవర్గంపై పట్టు ఉంది. పేద, మధ్య తరగతి ప్రజల సపోర్ట్ ఉంది. బలాబలాలు చూసుకుంటే..ఇద్దరు స్ట్రాంగ్ గానే ఉన్నారు. కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుంది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది..నెక్స్ట్ వైసీపీ గాలి అంత ఉండకపోవచ్చు. పైగా తూర్పులో ఉన్న వంగవీటి వర్గం గద్దెకు సపోర్ట్ చేయవచ్చు. అలాగే జనసేనతో పొత్తు ఉంటే..గద్దెకు బాగా కలిసొస్తుంది. జనసేన ఓట్లు కలిస్తే గద్దె హ్యాట్రిక్ ఆపడం కష్టమే. మరి చూడాలి ఈ సారి తూర్పు ఫలితం ఎలా ఉంటుందో.
