ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో కొందరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలనే క్రమంలో ఒకరినొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేత, దివంగత కోడెల శివప్రసాద్ కంచుకోటగా ఉన్న నరసారావుపేట అసెంబ్లీలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది.

1983 టూ 1999 వరకు అక్కడ కోడెల గెలిచారు. ఇక 1978, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాసు కృష్ణారెడ్డి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఈయన వైసీపీకి మద్ధతు ఇచ్చారు. అటు ఆయన తనయుడు కాసు మహేశ్ రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గురజాలలో పోటీ చేసి గెలిచారు. అయితే కాసు సొంత ప్లేస్ మాత్రం నరసారావుపేట. కాసు కృష్ణారెడ్డి అక్కడే ఉంటున్నారు. అయితే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరుపున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఆయన బలంగానే ఉన్నారు. కాస్త వ్యతిరేకత ఉన్నా సరే టీడీపీ బలపడకపోవడం ఆయనకు ప్లస్ అవుతుంది

ఈ విషయం పక్కన పెడితే..ఇప్పుడు అక్కడ కాసు వర్గంతో గోపిరెడ్డి వర్గానికి పడటం లేదు. తాజాగా క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలని పురస్కరించుకుని కాసు వర్గం..కాసు ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టడానికి చూసింది. కానీ ఆ ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫోటో లేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం ఫైర్ అయ్యి, కాసు వర్గాన్ని ఫ్లెక్సీలు కట్టకుండా ఆపేసింది.


దీంతో కాసు కూడా సమస్యని పరిష్కరించాలని చూశారు..కానీ గోపిరెడ్డి వర్గం వెనక్కి తగ్గట్లేదు. ఏదో వ్యక్తిగతంగా వేసుకునే ఫ్లెక్సీల్లో కూడా ఎమ్మెల్యే ఫోటో పెట్టమనడంపై కాసు వర్గం మండిపడుతుంది. అయితే ఈ అంశం పెద్దగా అయ్యేలా ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో గోపిరెడ్డికి కాసు వర్గం సహకరించే పరిస్తితి ఉండదని తెలుస్తోంది. కాసుకు నరసారావుపేటలో ఇంకా బలమైన ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ కాసు వర్గం యాంటీ అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డికే రిస్క్.

Leave feedback about this