అమలాపురం పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలే సాధించింది. దివంగత బాలయోగి పలుమార్లు ఇక్కడ గెలిచి లోక్ సభ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇక బాలయోగి వారసుడుగా హరీష్ గత ఎన్నికల్లో పోటీ చేసి చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.

అయితే జనసేన భారీ స్థాయిలో ఓట్లు చీల్చడంతోనే హరీష్ ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ నుంచి చింతా అనురాధా లక్కీగా గెలిచేశారు. ఇక ఆమె ఎంపీగా గెలిచారు గాని..అక్కడ ప్రజలకు అండగా ఉండటంతో విఫలమవుతున్నారు. ఇటు లోక్ సభలో కూడా ఈమె పెద్దగా గళం విప్పినట్లు కనిపించలేదు. అలాగే అమలాపురంలో జనాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఏదో ఫంక్షన్లు ఉంటే వెళ్ళడం తప్ప..ప్రజా సమస్యలని పట్టించుకున్నది లేదు. దీంతో ఆమెపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సారి ఆమె మళ్ళీ నిలబడితే గెలవడం చాలా కష్టమని తెలుస్తోంది.

అదే సమయంలో ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్న బాలయోగి తనయుడు హరీష్ ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ జనసేనతో టీడీపీకి రిస్క్ ఉంది. పొత్తు ఉంటే డౌట్ లేకుండా ఈ సీటు గెలిచేస్తారు. పొత్తు లేకపోతే కాస్త ఇబ్బందికర పరిస్తితులు వస్తాయి. కానీ ఎక్కువ శాతం టీడీపీ-జనసేన పొత్తు ఉండేలా ఉంది. పొత్తు ఉంటే అమలాపురం సీటు టీడీపీకే దక్కే ఛాన్స్ ఉంది.

అప్పుడు బాలయోగి తనయుడుకు గెలుపు అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇదే విధంగా పనిచేసుకుంటూ వెళితే అమలాపురం పార్లమెంట్‌లో హరీష్ గెలుపు నల్లేరు బండి మీద నడకే.
