ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని సంచలన నాయకుడు..అలాగే జగన్‌కు వీర విధేయుడు..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుని నాన్‌స్టాప్‌గా తిట్టే నాయకుడు. అయితే కొడాలి నాని రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే ఆ సంగతి అందరికీ తెలిసిందే. 2004లో అప్పటివరకూ గుడివాడలో టీడీపీ కోసం పనిచేసిన రావి ఫ్యామిలీని పక్కన పెట్టి..హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రికమండ్ చేయడంతో చంద్రబాబు..కొడాలికి సీటు ఇచ్చారు. 2004 ఎన్నికలో కొడాలి గెలిచారు..2009లో కూడా సత్తా చాటారు. కానీ 2012లో టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు.

అక్కడ నుంచి బాబు టార్గెట్ గా నాని ఏ విధంగా తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అప్పటినుంచి కొడాలికి చెక్ పెట్టాలని టీడీపీ కూడా ట్రై చేస్తుంది. కానీ 2014, 2019 ఎన్నికల్లో కూడా కొడాలికి టీడీపీ చెక్ పెట్టలేకపోయింది. పైగా 2019లో కొడాలికి మంత్రి పదవి కూడా దక్కింది. మంత్రి పదవి పోయినా సరే బాబుని తిట్టే విషయంలో కొడాలి కాంప్రమైజ్ అవ్వడం లేదు. అసలు జగన్‌ని ఒక్క మాట అంటే కొడాలి వంద మాటలు తిడతారు.

అలాంటి కొడాలి నాని..జగన్‌కు వీర విధేయుడుగా ఉంటూ..వైసీపీలో కీ రోల్ పోషిస్తున్నారు. అలాగే తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా వరుసపెట్టి ట్వీట్లు పెడుతూ కొడాలి నాని శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే క్రమంలో కట్టె కాలే వరకు జగనన్నతోనే ఉంటానని, తాను చచ్చేవరకు పార్టీ మారనని, రాజకీయాల్లో పదవిలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా తన ప్రయాణం జగన్ తోనే అని స్పష్టం చేశారు. అయితే కొడాలి పార్టీ మార్పుపై ఎలాంటి ప్రచారం లేదు..కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే..ఆయన వెనుక కొడాలి వెళ్తారని ప్రచారం మాత్రం ఉంది. అందుకే ఈ తరుణంలో కొడాలి కట్టె కాలే వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.
