సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం జరగడం ఖాయమని జగన్‌కు సైతం అర్ధమవుతుంది. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు అటు టీడీపీ, జనసేన నుంచి వచ్చిన అయిదుగురుని కూడా కలుపుకుంటే 156 మంది..మళ్ళీ వీరిందరికి సీట్లు వస్తే వైసీపీకే నష్టమని..ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు వర్క్ షాపుల్లో పరోక్షంగా కూడా చెప్పారు.

అంటే పనితీరు బాగోని, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని అంటున్నారు. అయితే గడపగడపకు సంబంధించి సర్వే రిపోర్టు ఇస్తున్నారు గాని..అసలు ఎమ్మెల్యేల పనితీరు బాగోని ఎమ్మెల్యే లిస్ట్ మాత్రం బయటపెట్టడంలేదు. గడపగడపకు వెళ్లని వారికి సీటు ఇవ్వకుండా ఉండటం కష్టమే. ఎందుకంటే గడపగడపకు తిరగని వారిలో బొత్స, బుగ్గన, పెద్దిరెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. అంటే వారికి సీటు ఇవ్వకపోవడం జరుగుతుందా? ఎట్టి పరిస్తితుల్లోనూ జరగదు.

అంటే గడపగడపతో సంబంధం లేదు..కానీ వ్యతిరేకత ఉన్నవారిని పక్కన పెట్టడం ఖాయం. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు జగన్ పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు సీటు విషయంలో జగన్ ఏది చెబితే అదే చేస్తామని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్…సీటు ఇవ్వకపోయిన వైసీపీ కార్యకర్తగా ఉంటానని అంటున్నారు. అంటే ఈయనకు సీటు గ్యారెంటీ లేదని తెలిసింది.

తాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు సీటు తనకు గాని, తన కుమారుడుకు గాని ఇవ్వకపోయినా పర్లేదు..కానీ స్థానికులకే సీటు ఇవ్వాలని అంటున్నారు. అంటే కన్నబాబు రాజుకు కూడా సీటు లేదని తెలుస్తోంది. అంటే సీటు దక్కదని కొంతమంది ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారని చెప్పవచ్చు.
